తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు సరికొత్త సేవలతో ముందుకొస్తోంది. ప్రయాణికులు, కండక్టర్ల మధ్య తరచుగా ఏర్పడే చిల్లర సమస్యలను ఎదుర్కొనేందుకు ఆర్టీసీ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి కొత్త పరిష్కారాన్ని తీసుకురానుంది. బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
హైదరాబాద్ నగరంలో ఈ కొత్త ఆన్లైన్ పేమెంట్ సేవలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రయాణికులు తమ బస్ టికెట్ ధరను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించే అవకాశం పొందనున్నారు. QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా లేదా ఇతర డిజిటల్ పేమెంట్ మార్గాల ద్వారా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త వ్యవస్థతో ప్రయాణికులు ఇకపై చిల్లర లేకుండా సులభంగా టికెట్ కొనుగోలు చేయవచ్చు.
RTC ఇప్పటికే 6,000 ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ మెషీన్లను సిద్దం చేసింది. ప్రస్తుతం వీటిని దూరప్రాంత రూట్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ సేవల విజయవంతమైన అమలుతో త్వరలోనే పల్లెవెలుగు, గ్రామీణ రూట్లలోని బస్సుల్లోనూ ఈ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త వ్యవస్థ వల్ల ప్రయాణికులకు మాత్రమే కాకుండా కండక్టర్లకు కూడా పని ఒత్తిడి తగ్గనుంది. చిల్లర సమస్యలతో నిత్యం విసిగిపోయే కండక్టర్లు, ఈ డిజిటల్ సేవల ద్వారా టికెట్ వేయడం మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు. అలాగే ప్రయాణికులు తమ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా అనుభవించగలరని RTC అధికారులు అంటున్నారు.
ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా RTC తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతో ప్రజాదరణ పొందే అవకాశం ఉంది. డిజిటల్ సేవలతో ప్రయాణికులు ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ప్రయాణ అనుభవాన్ని పొందగలరు. హైదరాబాద్లో విజయవంతంగా అమలు చేసిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను మరింత విస్తరించాలని RTC ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.