కేంద్రమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాలలో ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై చర్చలు జరగడం వల్ల ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫడణవీస్, అమిత్ షా మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనే కారణంతో అలకబూనిన ఏక్‌నాథ్ శిండే ఇప్పటికీ ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనను బీజేపీ నాయకత్వం ఒప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షా, ఫడణవీస్ మధ్య సమావేశం జరిగిందని అంటున్నారు.
కేబినెట్ విస్తరణకు సంబంధించి ఎవరికీ ఏ పదవి ఇవ్వాలి? అనే అంశంపై కూడా విస్తృతంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. రాష్ట్రంలో శిండే వర్గం, బీజేపీ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఒత్తిళ్లు ఈ విస్తరణకు కీలకమైన విషయం కావడం గమనార్హం. మహారాష్ట్రలో శిండే వర్గం బీజేపీపై పూర్తి ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తుండగా, బీజేపీ మాత్రం జాతీయ ప్రాధాన్యతతో నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో శిండేను బీజేపీ ఎలా ఒప్పిస్తుంది? అనే దానిపై రాజకీయ పరిశీలకుల దృష్టి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అమిత్ షా, ఫడణవీస్ భేటీ మహారాష్ట్ర రాజకీయాలలో నూతన మలుపు తిప్పే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై త్వరలోనే స్పష్టత వస్తుందని అంచనా.