తమిళనాడులో అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెల్లూరు, పెరంబూర్, సేలం, నామక్కల్, శివగంగ, ముదురై, దిండిగల్, తూత్తుకుడి, తెనాకాశీ, తేని జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను చేపట్టారు.
భారీ వర్షాల కారణంగా చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలదుత్తురై, పుదుకొట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువరూర్, రాణిపేట్, తిరువల్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాల ప్రభావంతో రహదారులు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసింది.
ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చిత్తూరు, తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు, సత్యవేడు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నీటి ముంపు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో అధికారులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
తిరుమల, తిరుపతి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా వర్షాల ప్రభావానికి లోనయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లతో భక్తులకు సహాయం చేస్తున్నారు. భారీ వర్షాలు ఇంకా కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయంలోనే బయటకు రావాలని సూచనలు జారీ చేశారు.