సరికొత్త ఆంధ్రప్రదేశ్ కోసం సమన్వయంతో ముందుకు వెళ్దాం
–జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
అమరావతి :
గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థల మూలాలు కదిలిపోయాయని, వ్యవస్థల్లోకి నిర్లక్ష్యం, నిర్లిప్తత ఆవహించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. పట్టాలు తప్పిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడానికే చాలా సమయం వెచ్చించాల్సి వస్తోందని వాపోయారు. శాఖాపరంగా సమీక్షలు చేస్తున్నప్పుడు గత ఐదేళ్లలో వ్యవస్థలు ఎంత దారుణంగా పని చేశాయో తెలుసుకొంటుంటే ఆశ్చర్యపోవడమే నా వంతవుతోoదన్నారు. ఈ పద్ధతి పూర్తిగా మారాలని, ప్రజల బాగు కోసం, రాష్ట్ర క్షేమం కోసం పనిచేసే విధానం అందరిలో రావాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అధ్యక్షతన మొదలైంది.
ఈ సదస్సులో పవన్ కళ్యాణ్
మాట్లాడుతూ “ప్రజల అభ్యున్నతి కోసం పాలసీలు చేయాల్సిన బాధ్యత పాలకులుగా మాపై ఉంటే… దానిని అంతే సక్రమంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థగా కలెక్టర్లపైన ఉంటుంది. అప్పుడే ప్రజలకు మంచి పాలన, సుస్థిరమైన అభివృద్ధి సమపాళ్లలో అందుతుంది. గత ఐదేళ్లుగా ఈ పద్ధతి పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా సాగిన అప్పటి పాలనను కలిసికట్టుగా ఎదుర్కోవాలనే గత ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి వారి ఆశీర్వాదం పొందాంమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మేము ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొనే ముందుకు వెళ్లినట్టు చెప్పారు. అప్పటి పాలకులు చట్టాలు, నిబంధనలు పట్టించుకోలేదని, కళ్ల ముందే తప్పు జరుగుతున్నా స్పందించలేదని విచారం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను నియంత్రించే శక్తి ఉన్న బ్యూరోక్రసీ కూడా నిస్సహాయంగా ఉండటం చూసి బాధ కలిగించిందని, ఇంతమంది బ్యూరోక్రాట్లకు అప్పట్లో జరిగిన అన్యాయాలను ఎదిరించే ధైర్యం లేకపోయిందని చెప్పారు. ఆ నిస్సహాయత నుంచే మేం రోడ్ల మీదకు వచ్చి ప్రజల తరఫున పోరాడామని, సినిమా టికెట్ల దగ్గర నుంచి ఇసుక వరకు, మద్యం అమ్మకాల దగ్గర నుంచి సహజ వనరుల దోపిడీ వరకు కళ్లముందే తప్పు జరుగుతున్నా అప్పట్లో ఎవరూ స్పందించలేదని విచారం వ్యక్తం చేశారు.
కష్టపడి సివిల్స్ పాసై ముస్సోరిలో ఐఏఎస్, హైదరాబాద్ లో ఐపీఎస్ శిక్షణ పొంది, పాలనలో నిష్ణాతులుగా బయటకు వచ్చే అధికారులు గత ప్రభుత్వంలో ఏం జరిగినా మౌనంగా ఉండిపోవడం చూసి ఆశ్చర్యమేసేదని అన్నారు.సిరియా, శ్రీలంక వంటి దేశాల్లో పాలకులు విఫలమైనా కార్యనిర్వాహక వ్యవస్థ బలంగా నిలబడి పరిస్థితిని చక్కదిద్దింది. గత ప్రభుత్వ పాలకులు చేసిన ఎన్నో ఆకృత్యాలకు ప్రజలు బలయ్యారని. ఇప్పుడు కుప్పలుతెప్పలుగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే బాధేస్తోందని పేర్కొన్నారు. జీతభత్యాలు లేక ఉద్యోగులు, సిబ్బంది బాధపడ్డారని, ప్రజలకు అన్ని విషయాల్లోనూ బాధలు ఎక్కువయ్యాయన్నారు. సత్యసాయి జిల్లాలో వాటర్ స్కీమ్ లో పని చేసే క్షేత్ర స్థాయి సిబ్బందికి వేతనాలు నెలల తరబడి అందలేదని నా దృష్టికి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాం. అలాంటి సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ బలంగా పనిచేయాలి. అప్పుడే అన్ని వర్గాలకు సరైన మేలు జరుగుతుంది. ప్రజలలో ఇప్పుడు బలమైన చైతన్యం ఉందని, ఏ తప్పు జరిగినా వారు తిరగబడతారని. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు సీరియస్ గా పని చేయాల్సి ఉందని, . నిర్లక్ష్యాన్ని వీడాలని హితవు పలికారు.