టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో అంతర్గత గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య తలెత్తిన విభేదాలు కుటుంబంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తన ఇంటి వద్ద జరిగిన గొడవలో గాయపడి, బంజారాహిల్స్‌లోని టీఎక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ సంఘటనలు సినీ అభిమానుల్లో ఆందోళనకు గురిచేశాయి.
తన భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించాడు. “నా కుటుంబానికి రక్షణ కోసం బౌన్సర్లను పెట్టుకున్నా. కానీ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నా ఆత్మగౌరవం కోసం నేను పోరాటం చేస్తున్నాను. ఇది డబ్బు కోసం కాదు, ఆస్తి కోసం కాదు” అని మంచు మనోజ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో, మంచు మోహన్ బాబు కూడా రాచకొండ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు. తనకు మంచు మనోజ్ నుండి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కుటుంబ వివాదంలో మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా భాగస్వాములయ్యారు. ఈ పరిణామాలతో పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరందరి మధ్య చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం తీసుకురావడం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ఎంతదూరం వెళ్తుందో అని మాట్లాడుకుంటున్నారు. మంచు కుటుంబం.. సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించిన కుటుంబం. ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.