కొన్ని కథలు, కొన్ని జీవితాలు ఎప్పటికీ వినాలనిపిస్తాయి.పదేపదే చదివినా,చూసినా ఇంకా ఏదో మిగిలిపోయిందేమో అన్న భావన కలిగిస్తాయి.అలాంటి ఓ అద్భుతమైన కథ సిల్క్ స్మిత జీవితంలో దాగి ఉంది.1980, 90 దశకాలలో ఈ పేరు తెలుగు, తమిళ భాషల్లో ఒక సంచలనంగా నిలిచింది.సినిమా థియేటర్ల వద్ద ప్రజల రద్దీ పెరిగేందుకు ఆమె పేరు చాలు.ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే కలెక్షన్లు వాటంతటవే వచ్చేవి.నిర్మాతల కోసం ఒక ఊరటనిచ్చే పేరు ఆమెది.సిల్క్ స్మితను చూసే కోణాలు ఎప్పటికీ ఒకేలా ఉండవు.ఆమెకు ఆ సమయంలో ఉన్న క్రేజ్‌ను, గుర్తింపును ఎలా గుర్తించాలో కూడా చాలా మందికి అర్థం కాలేదు.కెరీర్ పతాకస్థాయిలో ఉండగా ఆమె ఒంటరిగా జీవితాన్ని ముగించుకోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇంతకుముందు ఆమె జీవితంపై వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా, ఆమె అసలు వ్యక్తిత్వాన్ని పూర్తిగా బయటపెట్టలేకపోయాయి.2011లో విడుదలైన “డర్టీ పిక్చర్” ఈ కోవలో ముఖ్యమైనది.విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక విప్లవాత్మక విజయం సాధించింది.కానీ ఇది పూర్తిగా సిల్క్ స్మిత కథ అనలేమని కొందరు విమర్శించారు.ఆ తరువాత వచ్చిన “క్లైమాక్స్” అనే సినిమా అంతగా గుర్తింపు పొందలేకపోయింది.సిల్క్ జీవితంపై ఆసక్తి ఎప్పుడూ తగ్గలేదు. డిసెంబర్ 2న ఆమె జయంతి సందర్భంగా, మరోసారి ఈ కథ తెరపైకి రాబోతోంది. “సిల్క్ స్మిత” అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చంద్రికా రవి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జయరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.
తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. సిల్క్ స్మిత జీవితంలోని అసలైన కోణాలను ఈ సినిమాతో చూపించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇంతవరకు ఆవిష్కరించని నిజాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తమ లక్ష్యమని వారు వెల్లడించారు. సిల్క్ జీవితంలోని మలుపులను ఎలాంటి భావోద్వేగాలతో చూపించబోతున్నారో చూడాలి.ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేస్తుందా? సిల్క్ జీవితానికి న్యాయం చేస్తుందా? అనేది త్వరలోనే తెలిసేది. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు – సిల్క్ స్మిత కథ ఎప్పటికీ వినాల్సినదే. ఆమె జీవితం ఓ సినీ ప్రపంచానికి ఓ తీపి, చేదు జ్ఞాపకాల మిశ్రమం. ఈ కొత్త సినిమా ఆమె గురించి మరిన్ని చర్చలను తెరమీదకు తెస్తుందనడంలో సందేహమే లేదు.