మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో గండిమైసమ్మ సమీపంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మరియు ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. విగ్రహం ఆవిష్కరణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన కృషిని కొనియాడారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తారని, రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ద్రోహిగా చరిత్రలో నిలుస్తారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ రూపొందించిన ఈ కొత్త నమూనా విగ్రహంపై విమర్శలు పెరిగాయి. తెలంగాణ తల్లి దేవత రూపంలో ఉన్న స్థాయిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ సంస్కృతిలో తల్లిని పూజించే సంప్రదాయాన్ని అవమానించలేదని ఆయన అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కళాకారులు, కవులు, శిల్పుల సహకారంతో తెలంగాణ తల్లి ఆవిర్భవించిందని, ఇప్పుడు ఈ విలువలను అవమానించే వారిపై సమాధానం చెప్పమని పేర్కొన్నారు. తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మను సమాజం స్మరించుకుంటుందని, అలాంటి బతుకమ్మతో తెలంగాణను సాధించామన్నారు. ప్రపంచంలో ఎక్కడా తల్లులను మార్చే దుర్మార్గులు ఉండరు అని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినా, తల్లులుగా మనం ఎదిగిన సంప్రదాయాలు మారలేదని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి భావనను రక్షించడానికి ప్రతిస్పందించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.