తెలంగాణలో మార్పు చేయగల శక్తి బీజేపీదేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా చేయడంలో బీజేపీ విజయం సాధించిందని నడ్డా అన్నారు. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్బంగా నడ్డా .. కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులపై అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. బీజేపీ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తోందని, ముఖ్యంగా కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఉద్యమాలను ప్రస్తావించారు. దేశంలో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం విశేషమని, ఇది ప్రజల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడం వల్లే పార్టీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం బీజేపీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, ఎన్డీఏ గైడ్ చేస్తున్న ఆరు రాష్ట్రాల్లో కూడా మంచి పరిపాలన అందిస్తున్నామని నడ్డా తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, హర్యానాల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల ఆధారపడి పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వంచనకు పాల్పడుతుందని, బీజేపీ మాత్రమే ప్రజల ఆశలను నెరవేర్చగలదని నడ్డా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.