ప్రజా పరిపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని GV గూడెంలో వైద్య కళాశాల ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాల శంకుస్థాపన చేశారు. అనంతరం గంధంవారి గూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ ప్రత్యేక పాత్రను కొనియాడారు. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన శ్రీంకాంతాచారి నల్గొండ జిల్లాకు చెందినవారని గుర్తు చేశారు.
నల్గొండ జిల్లాలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ పోరాటం స్మృతులెన్నో ముందుకొస్తాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రజాకార్ల దుశ్చర్యలకు ఎదురొడ్డి నిలిచిన జిల్లా నల్గొండ అని అన్నారు. అయితే, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ జిల్లాకు న్యాయం చేయలేకపోయిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేస్తే ఫ్లోరైడ్ సమస్య తీరేదని, కానీ అది కేవలం మాటల్లోనే మిగిలిపోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని సీఎం అన్నారు. కృష్ణా జలాలు ప్రవహించేలా చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి దేశానికే మోడల్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వరి పంటలో నల్గొండ జిల్లా నెంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవని విమర్శించిన రేవంత్, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు బోనస్ అందజేస్తూ, ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన తమ విధానాలు రైతుల పక్షాన నిలిచినట్టుగా ఆయన చెప్పారు. వ్యవసాయం పండుగ అనే భావనకు తమ ప్రభుత్వం దోహదపడుతోందని అన్నారు.
నల్గొండ జిల్లాకు తగిన గుర్తింపుని తీసుకురావడం, అభివృద్ధి చేయడం తన ప్రభుత్వ కర్తవ్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ఆత్మను నిలబెట్టేలా నల్గొండ జిల్లా ప్రజల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాము చూపిస్తున్న శ్రద్ధను ప్రజలు గుర్తించి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.