అమరావతి : భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డా.బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి రఘురామ కృష్ణ రాజు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈంసదర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ కమిటకి అధ్యక్షునిగా అంబేద్కర్ అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో రాజ్యాంగాన్ని రచించుటలో కీలక పాత్ర పోషించారని ఆయన ఈసందర్భంగా గుర్తు చేశారు.
ఆనాడు సమాజంలోని పలు కులాల వెనుకబాటు తనాన్ని గుర్తించి త్వరితగతిన ఆయా కులాల వెనుకాటు తనాన్నిరూపు మాపేందుకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా రిజర్వేషన్లను పొందుపర్చారని అన్నారు.మన దేశానికి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన ఘణత అంబేద్కర్ కే దక్కుతుందని ఉప సభాపతి పేర్కొన్నారు.నేడు దేశమంతా అంబేద్కర్ సేవలను కొనియాడుతోందని ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.అంబేద్కర్ సేవలకు గుర్తుగా మన రాష్ట్రంలో ఒక జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడం జరిగిందని ఉప సభాపతి రఘరామ కృష్ణ రాజు తెలిపారు.
ఈకార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్న కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఇంకా పలువురు అసెంబ్లీ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్ని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.