అమెరికాలో భారీ భూకంపం (Earthquake ) సంభవించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత(7.0 magnitude earthquake)ను నమోదు చేసుకుంది. నార్తర్న్ కాలిఫోర్నియా (Northern California) తీరంలో సంభవించిన ఈ ప్రకంపనలు, సముద్రతీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) భూకంప తీవ్రతను గుర్తించి, యెల్లో అలర్ట్‌ను ప్రకటించింది. సాధారణంగా ఈ అలర్ట్ భూకంపం వల్ల సంభవించే నష్టాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. ఇప్పటికే అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, సహాయక చర్యల కోసం సన్నద్ధమవుతున్నారు. నేషనల్ సునామీ కేంద్రం (NTWC) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రతీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు తక్షణమే భద్రమైన ప్రదేశాలకు తరలించాలని అధికారులు కోరారు.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, గురువారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:44 గంటలకు ఉత్తర కాలిఫోర్నియాలోని హంబోల్ట్ కౌంటీలో 100 కిమీ వాయువ్య ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఇది మొదట 6.6 తీవ్రతతో కూడిన భూకంపంగా పేర్కొనబడింది. ఆ తర్వాత దీన్ని యూఎస్‌జీఎస్ 7.0గా గుర్తించింది. భూకంప కేంద్రం 0.6 కి.మీ లోతుగా గుర్తించినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఇక కాలిఫోర్నియాలో సుమారు 5.3 మిలియన్ల మంది ప్రజలు యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ జారీ చేసిన సునామీ హెచ్చరికలో ఉన్నారు. ఒరెగాన్ స్టేట్ లైన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా వరకు ఈ సునామీ హెచ్చరికలు ఉన్నాయి.
ప్రస్తుతం భూకంపం వల్ల ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు ఇంకా అందుబాటులో లేవు. ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, ప్రజలను భయాందోళనకు గురిచేయకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.