న్యూఢిల్లీ: సమాజ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ ముగ్గురూ పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనాభా తగ్గుదల ఆందోళనకరమన్నారు. అది సమాజాన్ని నాశనం చేస్తుందన్నారు. జనాభా సైన్స్ ప్రకారం.. జననాల రేటు 2.1 కంటే తక్కువగా ఉంటే ఈ భూమి మీద సమాజం అంతరించిపోతుందన్నారు. అందుకే ఇద్దరి కంటే ఎక్కువ లేదా ముగ్గురు అవసరం అన్నారు.
భారత జనాభా విధానం కూడా ఈ రేటు 2.1 కన్నా తక్కువ ఉండకూడదని చెబుతోంది. మన దేశానికి సంబంధించి ఇది మూడుగా ఉండాలని.. ఈ సంఖ్య చాలా కీలకం అన్నారు. ఎందుకంటే సమాజ మనుగడకు అది అవసరం అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. 1960-2000 మధ్య రెట్టింపు అయిన ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తరువాత నుంచి తగ్గుముఖం పడుతోందని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. ప్రతీ మహిళా 2.1 మందిని కంటేనే పాత తరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా భాషలు కనుమరగవుతున్నాయని తెలిపారు.
జపాన్ చైనా లాంటి దేశాలు అయితే దీనినే ఎక్కువగా ప్రచారంలో పెడుతున్నాయి. ప్రభుత్వం పరంగా ప్రోత్సాహకాలు కూడా ఇస్తూ పోతున్నాయి. మరో వైపు రష్యా తీసుకుంటే ఆ దేశ జనాభా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జనాభా పెరుగుదలకు ఆ దేశం అన్ని చర్యలను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అంటూ కొత్త మంత్రిత్వ శాఖను రష్యా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తుంది. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించేలా రష్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఇక వెనక్కి వెళ్ళి చూస్తే కనుక 1950 ప్రాంతంలో ఒక మహిళ సంతానోత్పత్తి రేటు జీవిత కాలంలో 4.7 గా ఉండేది అని గుర్తు చేస్తున్నారు. అది అలా తగ్గుతూ 2017 నాటికి 2.4 శాతానికి పడిపోయింది అని అంటున్నారు. ఇది యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ కి చెందిన ఇన్సిటిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యూషన్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది అంటున్నారు. ఇక ఈ అధ్యయనం ప్రకారం చూస్తే 2100 నాటికి అంటే ఇప్పటికి మరో డెబ్బయి అయిదేళ్లకు జనాభా వృద్ధి రేటు 1.7 శాతానికి పడిపోవచ్చు అని కూడా చెబుతున్నారు. ఇక 2064 నాటికి ఈ ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక 2100 నాటికి 880 కోట్లకు పడిపోతుందటా. అంటే ఒక్కసారిగా 90 కోట్లు తగ్గుదల అన్న మాట. ఇపుడు అధిక జనాభా అని అంతా అంటున్న పరిస్థితి నుంచి జనాలు ఎక్కడ ఉన్నారో వెతుక్కునే దారుణమైన పరిస్థితులు కూడా వస్తాయని నిపుణుల అంటున్నారు.