అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు, పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు ఆహ్వానం మేరకు సీఎం నివాసంలో ఈ భేటీ ఆసక్తి కరం గా మారింది. ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపిక పైన ఈ ఇద్దరు చర్చించనున్నారు. మూడు పార్టీలకు ఒక్కో సభ్యుడి ప్రతిపాదనలో మార్పులు జరిగాయి. రాజీనామా చేసిన ఇద్దరిలో బీదా మస్తానరావు టీడీపీ నుంచి, ఆర్ క్రిష్ణయ్య బీజేపీ నుంచి తిరిగి ఎన్నిక కావటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మూడో సీటు కోసం టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో పోటీ ఉంది.
దీంతో, జనసేన నుంచి నాగబాబు ఎంపిక పైన డైలమా కొనసాగుతోంది. ఈ భేటీలో రాజ్యసభ అభ్యర్ధుల పైన తుది నిర్ణయానికి రానున్నారు. అదే విధంగా పవన్ కల్యాణ్ తన ఢిల్లీ పర్యటన.. ప్రధానితో భేటీ అంశాల పైన సీఎం కు వివరించనున్నారు. కాకినాడలో బియ్యం అక్రమ రవాణా అంశం పైన పవన్ సీరియస్ గా స్పందించారు. రవాణా చేస్తున్న షిప్ ను సీజ్ చేయాలని అక్కడే ఆదేశించారు. ఈ వ్యవహారం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బియ్యం పోర్టుల నుంచి విదేశాలకు తరలి వెళ్తుందని గుర్తించారు. దీంతో, బియ్యం అక్రమ రవాణా.. దీని వెనుక ఉన్నసూత్రధారులను గుర్తించేందుకు విచారణ చేయించాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు.
ఇకపోతే..కాకినాడ పోర్టులో పవన్‌కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం పర్యటించారు. తొలుత 12.45గంటలకు యాంకరేజ్ పోర్టులో బార్జిలో తనిఖీలు చేశారు. ఇం దులో రేషన్ బియ్యం ఎగుమతి అవుతుండడంతో ఇటీవల అధికారులు పట్టుకున్నారు. నేరుగా పవన్ బార్జి ఎక్కి బియ్యం ప్లేటులో వేసి పరిశీలించారు. రేషన్ బియ్యం ఆనవాళ్లను గుర్తించారు. అక్కడే ఉన్న డీఎస్‌వో, కలెక్టర్, పోర్టు అధికారి, ఇతర అధి కారులపై తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ మాఫి యాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతోందని శివాలెత్తారు. ఉద్యోగాలు చేస్తున్నారా.. మాఫియాకు వంత పాడుతున్నారా? అంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మె ల్యే కొండబాబును ఉద్దేశించి దీనిపై మరింత గట్టి పోరాటం చేయాలని, నెమ్మదిగా ఉండకూడదని పేర్కొన్నారు. అనంతరం అక్కడినుంచి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత డీప్‌వాటర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి టగ్ ఎక్కి సముద్రంలోకి వెళ్లారు.