హైదరాబాద్: రాజకీయాల నుంచి కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. ఎన్నికలు మొదలుకొని తీరిక లేకుండా రాజకీయాల్లో బిజీగా ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొన్నిరోజుల పాటు రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నానని.. దీని కారణంగా ప్రత్యర్థులు మిస్ అవ్వరు కదా అంటూ పోస్టు చేశారు. అయతే ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
కేటీఆర్ గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకు కొద్ది రోజులు మినహా పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉన్నారు. అందుకే కొన్ని రోజుల పాటు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దీక్షా దివస్ విజయవంతం కావడంతో శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ శ్రేణులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇకపై రెగ్యులర్‌గా ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, కేటీఆర్ విశ్రాంతి తీసుకొని మరింత ఉత్సాహంగా పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు రావాలని భావిస్తున్నారు. శ్రేణులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. విశ్రాంతి సమయంలో ప్రత్యర్థుల విమర్శలకు తాము సమాధానం ఇస్తామంటూ ట్విట్టర్‌లో ఆయన పోస్టుకు కామెంట్స్ పెడుతున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.
ఇకపోతే..శుక్రవారం జరిగిన దీక్షా దివస్‌లో మాట్లాడిన కేటీఆర్… కాంగ్రెస్ ఏడాది పాలనలోనే తెలంగాణలో పూడ్చలేని నష్టం వాటిల్లిందన్నారు. గుజరాత్ గులాములు, ఢిల్లీ కీలుబొమ్మలతో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అవసరమైతే ప్రజల కోసం మరోసారి దీక్ష చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవతం చేసిన వారందరికీ ఆయన అభినందలు తెలియజేశారు.