తెలంగాణ రాష్ట్ర సర్కార్ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 09 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభమైంది. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఆధార్ నెం లు , వారి ఆస్తులు , అప్పులు , ఇంట్లో ఉన్న వస్తువులు , ప్రభుత్వ పధకాలు అందుతున్నాయా లేదా..గత ప్రభుత్వం నుండి పొందిన పధకాలు , సొంత ఇల్లు ఉందా లేదా , ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నాయా లేదా ఇలా అనేక ప్రశ్నలు అడిగి ఆ వివరాలు నమోదు చేసుకుంటున్నారు.
జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లాల్లో 99శాతం కుల గణన సర్వే పూర్తి అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 19 జిల్లాల్లో వంద శాతం పూర్తయినట్లు పేర్కొంది. 49,79,473 ఇళ్లకు కంప్యూటీకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపింది. అత్యధికంగా ములుగు 92శాతం డేటాను కంప్యూటీకరించారు. మరోవైపు GHMCలో 82.4 శాతం సర్వే పూర్తయింది. కుల గణన సర్వేతో సమాజంలో మార్పుతో పాటు అన్ని వర్గా ల ప్రజల న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తుంది.సంక్షేమ ఫలాలతోపాటు రాజకీయంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ తదితర అంశాల్లో వాటా లభిస్తుందని, రాహుల్‌గాంధీ ఆలోచనల మేరకు సమగ్ర కుల గణన ద్వారా ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు.
మొత్తం 75 రకాల ప్రశ్నలపై కుల గణనలో వివరాలు సేకరిస్తున్నారు. వీటిలో ఆదాయం ఎంత? ఆస్తులెన్ని? ట్యాక్స్ చెల్లిస్తున్నారా? ఏమేం వాహనాలు ఉన్నాయి? పట్టాదారు పాసుపుస్తకం నంబర్, ఆధార్ నంబర్ లాంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. దీంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఈ వివరాలన్నీ ఇస్తే.. తమకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న పథకాలు పోతాయేమో, తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ లాంటివి తీసేస్తారేమో అనే అపోహలు ఉన్నాయి. ఈ సర్వేతో ఏ కార్డులు పోవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధి చేసేందుకే ఈ సర్వే చేస్తున్నాం. సర్వే ద్వారా సేకరించిన వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం’ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.