తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ జరుపుతున్నాయి. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసేందుకు బీఆర్‌ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తుంది. జిల్లాల ఇన్‌చార్జిల నేతృత్వంలో ర్యాలీలతో పాటు అమరవీరులకు నివాళులు, ఫొటో ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొంటున్నారు.
సిద్ధిపేటలో మాజీ మంత్రి హరీష్‌రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని రంగదాంపల్లిలో అమరులవీరుల స్థూపం దగ్గర అంజలి ఘటించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ..కొందరు దొంగలు పార్టీలోకి వచ్చారని.. పందికొక్కుల్లగా తిని మళ్లీ వెళ్లిపోయారని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణను కాపాడాలని ఆరోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని.. ఇకపై అలాంటి వారికి పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేశారు. కేంద్రంలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణను చేర్చారని… షిప్పింగ్ శాఖ ఇస్తే, డీఎంకే వాళ్ళు అడిగితే ఇచ్చేశారని వెల్లడించారు. తెలంగాణ కోసం శాఖ లేని మంత్రిగా ఆరు నెలలు కేసీఆర్ పని చేశారని గుర్తు చేశారు. అయినా కాంగ్రెస్ ఏం చేసిందో తెలిసిందే.. ఎన్నో పోరాటాలు, అవమానాలు ఎదురయ్యాయన్నారు. గడ్డి పోచల్లాగా పదవులను తెలంగాణ కోసం త్యాగం చేశామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణకు అనుకూలమని తీర్మానాలు చేసి, అవసరాలు తీరాక మాట మార్చారని దుయ్యబట్టారు.
నాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని కోరితే నేటి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వెన్ను చూపారని విమర్శించారు. సిద్దిపేటలో తెలంగాణ కోసం చేపట్టిన దీక్ష శిబిరం 1531 రోజులు నడిపామన్నారు. తెలంగాణ కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడన్నారు. తెలంగాణ సాధనలో ఒక కార్యకర్తగా పాల్గొన్న తృప్తి మరిదేనితో సమానం కాదన్నారు. ‘‘రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నాడా ? ఉద్యమంలో ఒక్క కేసు ఉన్నదా..? ఒక్కనాడైనా అమరులకు పూలు వేషాడా ? ఈయన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట. అలుగునూరులో కేసీఆర్‌ను అరెస్టు చేసిన ఆనవాళ్లు, ఖమ్మం జైలులో దీక్ష చేసిన అనవాళ్ళు తుడుస్తావా? లేక తెలంగాణ సాధించి, తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనవాళ్లు తుడిచి వేస్తావా? జై తెలంగాణ అన్న వారిపై తుపాకీతో వెళ్లిన మరక నీ జీవితంలో ఎన్నటికీ పోదు అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.