ఇంఫాల్: మణిపూర్‌లో కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్నవిషయం తెలిసిందే. అక్కడ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలో భారీగా సైనికులను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. ఈ నేపథ్యంలో ఇంఫాల్, జిరిజామ్ జిల్లాల్లో గత 13 రోజులుగా మూతబడిన పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచుకున్నాయి. శుక్రవారం నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభింస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. దీంతో ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు పునఃప్రారంభమయ్యాయి. గత కొంతకాలంగా నిరుగప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌లో ఈ నెల 16న మళ్లీ హింస చెలరేగింది.
అల్లరి మూకలు మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లకు నిప్పంటించాయి. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇంటిపై దాడి చేయడానికి యత్నించాయి. కర్ఫ్యూ విధించినా ఇండ్లను దగ్ధం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇంఫాల్ లోయ లో తీవ్ర అశాంతి నెలకొంది. దీంతో ఇంఫాల్ వ్యాలీలోని 5 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలను నవంబర్ 23 వరకు మూసివేసి ఉంచుతామని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కక్చింగ్ జిల్లాలలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నీ మూతబడి ఉంటాయని చెప్పారు. దానిని శుక్రవారం వరకు పొడిగించారు. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా సైన్యాన్ని మోహరించింది. దీంతో కేంద్ర బలగాల మొత్తం కంపెనీల సంఖ్య 288కు చేరింది.