తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉందని తెలిపింది. నిన్న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్లో చాలా చోట్ల 10 డిగ్రీలు, HYD శివారులోని పటాన్ చెరు ప్రాంతంలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.8 డిగ్రీలు నమోదయింది. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్, జిల్లాల్లోని పలు మండలాల్లో 11 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆ జిల్లాలకు ఆరేంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. చలి తీవ్రత పెరగటంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
రెండేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజులుగా పిల్లల్లో శ్వాసకోస సంబంధిత సమస్యల తీవ్రత సాధారణ పరిస్థితులతో పోలిస్తే 20 శాతం నుంచి 30 శాతం పెరిగిందని చెబుతున్నారు. చలి వాతావరణంలో పిల్లలపై ఎక్కువగా వైరల్ ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదముందని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. హైపోథెర్మియాతో సమస్యలు వస్తాయని.. మొదట జలుబు సోకి, తర్వాత వైరస్‌లతో న్యుమోనియా, ఫ్లూ లాంటివి దారితీస్తాయన్నారు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.