భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, అబ్బయ్య ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994, 2009లో ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు. సీపీఐ నుంచి ఒకసారి..TDP నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇల్లందు మండలం హనుమంతుల పాడు గ్రామానికి చెందిన అబ్బయ్య సీపీఐ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి తొలుత సుదిమల్ల సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అబ్బయ్య అంచలంచెలుగా ఎదిగి బూర్గంపాడు, ఇల్లందు నుంచి సీపీఐ తరుపున పోటీ చేసి రెండుమార్లు గెలుపొందారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరి ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
2018లో టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. 1983లో బూర్గంపాడు నియోజకవర్గం నుంచి, 1994, 2009లో ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అబ్బయ్య మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ నాయక్, గుమ్మడి నరసయ్య, సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు సంతాపం తెలిపారు. అబ్బయ్య మృతితో కుటుంబ సభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు.