హైదరాబాద్: షాద్ నగర్ కు చెందిన కౌశిక్ రాఘవ (17) హైదరాబాద్ మియాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే అతడే హాస్టల్ గదిలో శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యను కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
కాగా, శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు అర్థాంతరంగా తనువులు చాలిస్తున్నారని నవ తెలంగాణ విద్యార్థి శక్తి సంఘం అధ్యక్షుడు పవన్ ఆరోపించారు. కాలేజీ యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ఇటీవల హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు-రాధిక దంపతులకు కుమారుడు జశ్వంత్‌గౌడ్ (17)తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జశ్వంత్‌గౌడ్ నిజాంపేట్ జర్నలిస్టు కాలనీలోని శ్రీచైతన్య బాలుర వసతిగృహంలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి పడుకున్నాడు. నవంబర్ 14 గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తోటి విద్యార్థులు నిద్రలేచి చూడగా గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరి వేసుకొని వేలాడుతూ కన్పించాడు. విషయాన్ని కళాశాల వార్డెన్‌కు తెలుపగా వెంటనే నిజాంపేట్‌లోని హోలిస్టిక్ దవాఖానకు తరలించారు. అప్పటికే జశ్వంత్‌గౌడ్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు.