రాంచీ: జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య జార్ఖండ్‌లో హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండియా కూటమి 38 చోట్ల లీడ్‌లో ఉన్నది. ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ మార్క్ 41 సీట్లు దాటాల్సి ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలో ఉన్నది. ఈ ఎన్నికల్లో జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన విషయం తెలిసిందే.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం ఉందని జార్ఖండ్ ముక్తి మోర్చా జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి సుప్రీయో భట్టాచార్య పేర్కొన్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఎన్డీఏ కూటమికి ప్రజలు వ్యతిరేక తీర్పు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. సీఎం హేమంత్ సోరెన్ కూడా తమ పార్టీ గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. తప్పకుండా అధికారంలోకి వస్తామనే హేమంత్ సోరెన్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.