హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. సచివాలయానికి తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసివేస్తున్నారు. దాదాపు రూ.3 కోట్ల 20 లక్షల వ్యయంతో వాస్తు మార్పులు చేస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మార్పులో భాగంగా ప్రస్తుత ప్రధాన ద్వారం తలుపులు తీసేసి ఆ ప్రాంతంలో రేకులు ఉంచారు. ఈశాన్య గేటుకు తూర్పు వైపున ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ప్రధాన ద్వారం ఉన్న చోట మరో గేటును ఏర్పాటు చేస్తారు. సచివాలయంలోని మిగిలిన గేట్లను యథావిధిగా ఉంచనున్నారు. వచ్చే నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఆ లోపలే సచివాలయ వాస్తు మార్పులు పూర్తి చేసే పనుల్లో అధికారులు ఉన్నారు.
కాగా, తెలంగాణ సెక్రటేరియట్‌కు ప్రస్తుతం నాలుగు వైపులా ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్‌కు ఎదురుగా బాహుబలి గేటు ఉండేది. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు ఉన్న మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహం, దాని చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. అందుకే గత కొంతకాలంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పుడు ఈ మార్గంలోనే నైరుతి, ఈశాన్య గేట్లను కలుపుతూ రోడ్డును నిర్మిస్తున్నారు.ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ప్రస్తుతం ఈశాన్యం వైపున ఉన్న గేటును రాకపోకల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ గేటు పక్కనే మరో గేటును నిర్మించనున్నారు. ఒక గేటు నుంచి లోపలికి, మరో గేటు నుంచి బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నారు. తెలంగాణ సచివాలయాన్ని గత బీఆర్ఎస్ హయాంలో 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 2023 సంవత్సరం ఏప్రిల్ 30న దీన్ని కేసీఆర్ ప్రారంభించారు.