తిరుమలలో భక్తుల రద్దీ కొద్దిగా తగ్గిందని సమాచారం. శుక్రవారం రోజున 61,613 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. వారిలో 20,291 మంది తలనీలాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఆ రోజు హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి 3.12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉండగా, క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు నేరుగా స్వామి వారి దర్శనానికి వెళ్లారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 8 నుంచి 10 గంటల సమయం పట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ సమయంలో భక్తుల సౌకర్యం కోసం స్వామివారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు అందజేశారు.కార్తీక మాసాన్ని పురస్కరించుకుని, టీటీడీ అధికారులు శనివారం తిరుమలలో వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది ప్రతి కార్తీక మాసంలో ఆనవాయితీగా నిర్వహించే ప్రత్యేక ఉత్సవం.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని వైభవోత్సవ మండపానికి తీసుకెళ్లి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపుతో ప్రత్యేక అభిషేకం చేస్తారు.అయితే వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో, ఈ ఏడాది వనభోజన కార్యక్రమాన్ని పార్వేట మండపం వైభవోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆలయంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.