కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక పౌర్ణమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి.
‘శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున, కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ‘ప్రాశస్త్యం’ కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.
ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా… మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే… కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.