గమ్యం ఫేమ్ డైరెక్టర్ క్రిష్ రెండో వివాహం చేసుకొని మరోసారి ఓ ఇంటివారు అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన చల్లా హాస్పిటల్స్ అధినేత్రి, ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రీతి చల్లాను ఈరోజు హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కొద్దీ మంది సినీ ప్రముఖులు, ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కాగా, ఈనెల 16న రిసెప్షన్ కూడా ఉంటుందని, దీనికి సినీ ప్రముఖులు హాజరవుతారని సమాచారం. 2016 లో క్రిష్..రమ్య వెలగను పెళ్లి చేసుకున్నారు. ఆగస్టు 7, 2016లో వీరి వివాహం జరుగగా.. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థల రావడంతో 2018 లో చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి ఒంటరిగా ఉన్న క్రిష్… ఈరోజు రెండోసారి వివాహ బంధంలో అడుగు పెట్టారు
జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ విషయానికి వస్తే..క్రిష్ గుంటూరులో పుట్టి పెరిగాడు. ఈయన తాత జాగర్లమూడి రమణయ్య పోలీసు అధికారి. ఆయన సంతానం ఆరుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మనవళ్ళు, మనవరాళ్ళందరిలోకీ క్రిష్ పెద్దవాడు కావడంతో తాతగారి దగ్గర చనువు ఎక్కువగా ఉండేది. క్రిష్ చిన్నతనం నుంచే కథలు, చదవడం, రాయడం మీద ఆసక్తి ఉండేది. తండ్రి జాగర్లమూడి సాయిబాబా కు సినిమాలంటే ఆసక్తి. కొన్నాళ్ళు ఒక సినిమా థియేటర్ నడిపి గిట్టుబాటు కాక మధ్యలో వదిలేశాడు.
గుంటూరు లో ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న క్రిష్ ఫార్మసీ చదవడం కోసం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో చేరాడు. అక్కడ చదువు పూర్తయిన తర్వాత ఫార్మసీలో ఎం. ఎస్. చేయడం కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ కూడా పుస్తకాలు బాగా చదివేవాడు, సినిమాలు చూసేవాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న కొంతమంది స్నేహితులు అతన్ని ప్రోత్సహించేవారు.
అమెరికాలో ఉన్నప్పుడే ఒక కథ రాసుకుని దాన్ని సినిమాగా తీద్దామనుకున్నాడు. అక్కడ కుదరకపోవడంతో భారతదేశానికి వచ్చి ప్రయత్నిద్దామనుకున్నాడు. మొదటగా స్నేహితుడు రాజీవ్ తో కలిసి ఫస్ట్ బిజీ సొల్యూషన్స్ అనే పేరుతో ఒక కంపెనీ స్థాపించి అది ఒక స్థాయికి వచ్చిన తర్వాత రాజీవ్ కు అప్పగించి తాను సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఒకరికొకరు సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రసూల్ ఎల్లోర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరాడు. అదే సమయంలో ఏదో కొత్తగా రాయాలి అనే తపన పెరిగింది. బాలీవుడ్ కోసం గాంధీ గాడ్సే కథను రాయడం మొదలుపెట్టాడు. పరిశోధన కోసం నాగపూరు, పుణె, సాంగ్లి లాంటి చోట్ల తిరిగాడు. కానీ ఆ ప్రయాణంలోనే కొన్ని అనుభవాల వల్ల తిరిగి హైదరాబాదుకు రావాలనుకున్నాడు.
ఒక చిన్న హోటల్ లో కూర్చుని గమ్యం సినిమా కథ రాసుకున్నాడు. 2008 లో,క్రిష్ అల్లరి నరేష్, శర్వానంద్, కమాలినీ ముఖర్జీ నటించిన, గమ్యంతో తన సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకొని వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరక్కించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహరవీమల్లు సినిమా లోవర్క్ చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు క్రిష్ నే డైరెక్టర్ కానీ సినిమా ఆలస్యం అవడం తో జ్యోతికృష్ణ ఎంట్రీ అయ్యి..డైరెక్టర్ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం అనుష్కా శెట్టితో ఘాటి సినిమా తెరకెక్కిస్తున్నాడు.