ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్ (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన తన ఇంట్లోనే అర్ధరాత్రి మృతి చెందారు. రేపు అంత్య క్రియలు జరగనున్నాయి. కాగా గణేశ్ 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇండియన్ 2, కాంచన3, అభిమన్యుడు వంటి అనేక సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులనూ అలరించారు. గణేశ్ మరణంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతంలో 1944 ఆగస్టు 1న జన్మించిన గణేశ్, చిన్ననాటి నుంచి నటన పట్ల ఉన్న ఆసక్తిని వృత్తిరూపంలో మార్చుకున్నారు. ఆయన పూర్తి పేరు గణేశన్. ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన దక్షిణ భారత నాటక సభ థియేటర్ ట్రూప్‌లో పని చేయడం వల్ల ఆయన “ఢిల్లీ గణేశ్”గా ప్రసిద్ధి చెందారు. ఈ పేరును ఆయనకు దిగ్గజ దర్శకుడు కే. బాలచందర్ ఇచ్చారు, అంతేకాదు, ఆయనను సినీరంగంలో ప్రవేశపెట్టిన వారు కూడా కే. బాలచందర్.
అయితే, సినీరంగంలోకి రావడానికి ముందు గణేశ్ భారత వాయుసేనలో కూడా పనిచేశారు. 1964 నుండి 1974 వరకు దేశానికి సేవలందించిన గణేశ్, తర్వాత తన అభిరుచిని అనుసరించి నటనలో ప్రవేశించారు. 1976లో కే. బాలచందర్ దర్శకత్వం వహించిన “పట్టిన ప్రవేశం” సినిమాతో ఆయన వెండితెరపై తొలి అడుగులు వేశారు. సహాయ నటుడిగా, కమెడియన్‌గా చేసిన పాత్రల ద్వారా ఆయన ప్రఖ్యాతి గడించారు. 1981లో “ఎంగమ్మ మహారాణి” చిత్రంలో హీరోగా కూడా కనిపించినప్పటికీ, సహాయ పాత్రలలో, కమెడియన్‌గా ఉన్న విశేష ప్రతిభతోనే ఆయనకు మరింత గుర్తింపు వచ్చింది.
ఢిల్లీ గణేశ్ దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌లో 400కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సింధు భైరవి, నాయకన్, మైఖేల్ మదన కామరాజు, ఆహా, తెనాలి వంటి సినిమాలు గొప్ప గుర్తింపు తెచ్చాయి. తెలుగులో కూడా కొన్ని చిత్రాలలో ఆయన తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనలో చేసిన కృషికి గాను ఆయన తమిళనాడు ప్రభుత్వ విశేష బహుమతులు, కలైమామణి అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.
గణేశ్ సినిమాలే కాకుండా, టెలివిజన్ సీరియల్స్‌లో కూడా విశేషంగా పాల్గొన్నారు. 1990 నుండి అన్ని దక్షిణాది భాషల్లో సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. సపోర్టింగ్ రోల్స్‌తో ఆయన కుటుంబ సభ్యుల వంటి పాత్రల్లో జీవించారు. అంతేకాక, గణేశ్ అనేక షార్ట్ ఫిలింస్‌లోనూ నటించి కొత్త తరం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ప్రతిభ చూపించారు. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని చిరంజీవి పాత్రకు తమిళ్ వెర్షన్ “కాదల్ దేవతై”లో గణేశ్ స్వరాన్నిచ్చారు. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉన్న ఢిల్లీ గణేశ్ అకాల మరణం సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.