విజయవాడ: నేడు సీఎం చంద్రబాబు , కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు , ఇతర అధికారులు కలిసి విజయవాడ – శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ను ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి సీ ప్లేన్ లోనే శ్రీశైలంకు చేరుకుని అక్కడ మల్లన్నను దర్శనం చేసుకుని, తిరిగి సీఎం చంద్రబాబు విజయవాడకు రానున్నారు. నిన్ననే సీ ప్లేన్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ఈ ట్రయల్ రన్ ను నిర్వహించారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు చంద్రబాబు సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించి.. శ్రీశైలం ప్రయాణించనున్న నేపథ్యంలో నిన్న సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు సీఎం చంద్రబాబు పున్నమి ఘాట్ కు చేరుకుని ..12 గంటలకు సీ ప్లేన్‌లో ప్రయాణం ప్రారంభించి 12.45 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం తిరిగి 2.20 గంటలకు సీ ప్లేన్ లో బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు విజయవాడ పున్నమిఘాట్‌కు చేరుకుంటారు.
సీ ప్లేన్ ప్రత్యేకతలు..
డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ సీ ప్లేన్ ను తయారు చేసింది. మొత్తం 14 సీ ప్లేన్లు విజయవాడ – శ్రీశైలం మధ్య ఇవి నీటిపై ప్రయాణించనున్నాయి. టెంపుల్ టూరిజంను, రాష్ట్రంలో వైమానిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ సీ ప్లేన్ ను తీసుకొస్తుంది. సీ ప్లేన్ లో ఒక్కో టికెట్ ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.
సీ ప్లేన్ 1500 అడుగుల ఎత్తులో 150 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. మొత్తం 30 నిమిషాల పాటు సీ ప్లేన్ ప్రయాణిస్తుంది. ఇందులో టేకాఫ్, ల్యాండింగ్ కు 10 నిమిషాల సమయం పడుతుంది. ఇవి రెండూ నీటిపైనే జరుగుతాయి. రన్ వే అవసరం ఉండదు. 20 నిమిషాల పాటు ఆకాశంలో విహరిస్తుంది. సీ ప్లేన్ లో ప్రయాణించేవారు.. ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకూ.. నీటి అందాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు.. అతి తక్కువ సమయంలోనే శ్రీశైలం మల్లన్నను కూడా దర్శించుకునే వెసులుబాటు ఉంటుంది.
శ్రీశైలంలోని పాతాళగంగ అక్కమహాదేవి గుహాలకు వెళ్లే జల మార్గంలో సీ ప్లేన్ దిగేందుకు అనుకూలతలను అధికార యంత్రాంగం గుర్తించింది. వాయు మార్గంలో వచ్చే విమానం నీటిపై దిగి దాదాపు అర కిలోమీటరు దూరం ప్రయాణించి జెట్టీ దగ్గర ఆగనుంది. సీ ప్లేన్ ప్రయాణం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. దీంతో శనివారం జరిగే సీఎం పర్యటన దృష్ట్యా విజయవాడ ప్రకాశం బ్యారేజీ-శ్రీశైలం మధ్య నేడు సీ ప్లేన్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.