నెల రోజుల క్రితం వరకు విమాన ప్రయాణం అంటే తెగ సంబరపడి ప్రయాణికులు..ఇప్పుడు విమాన ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. మన గమ్య స్థానానికి క్షేమంగా చేరుకుంటామా లేదా..? వెళ్లే దారిలో ఎవరైనా విమానాన్ని పేలుస్తారా ఏంటి..? అసలు విమాన ప్రయాణం అవసరమా..? అని ఇలా అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు. దీనికి కారణం గత కొద్దీ రోజులుగా విమానాలకు వరుస బాంబ్ బెదిరింపు కాల్స్ రావడమే. తద్వారా ప్రయాణికులు, అధికారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రధానంగా డొమెస్టిక్ విమానాలు లక్ష్యంగా పెట్టుకుని సోషల్ మీడియా, ట్విట్టర్ వేదికగా ఈ సందేశాలు పంపుతున్నారు.
గత పది రోజులుగా రోజుకు నాలుగు లేదా ఐదు విమానాలకు ఈ బెదిరింపులు రావడంతో ఏయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది ప్రతిరోజూ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులు, వారి సామాను, ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చే వాహనాలను కూడా పూర్తిగా స్కానింగ్ చేసి, భద్రతా పర్యవేక్షణ కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఖంగారుపడుతూ చాలామంది తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం చేస్తున్నారు.