హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈరోజు యూఎస్‌కు చెందిన ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ ఎన్‌ఆర్‌ఐ నేతలతో ఆయన వీడియో కాన్ప్‌రేన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయిందని అన్నారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొందని, రాష్ట్రంలో సీఎం హామీలకు విలువ లేకుండా పోయిందన్నారు. దక్షిణాదికి అన్యాయం పేరుతో ఆ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, మీడియా ప్రచారం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బీఆర్‌ఎస్ పనైపోయిందని, ఆ పార్టీలో క్యాడర్ లేరన్నారు. ఆ పార్టీలో కొంతమంది నేతలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఆదాయం కోసం కాకుండా ఆలయాల్లో ప్రజలకు సేవలందిస్తామని, హిందూ ధర్మం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కనీసం ఐదుగురు విదేశీయులను భారత్‌లో పర్యటించేలా కృషి చేయాలని ఎన్నారైలకు ఆయన సూచించారు. దేశాభివృద్ధి కోసం తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్.. మాట తప్పిందని విమర్శించారు. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఇవ్వాలని విన్నవించినా చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు. సమస్యను పరిష్కరించకుండా పోలీసులతో అణగదొక్కాలని చూస్తారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు మాజీ సర్పంచ్ కుంటుంబాల ఉసురు తగులుతుందన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మాజీ సర్పంచ్‌ల అరెస్టు దుర్మార్గమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు అప్పుల పాలవడానికి కారకులు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలేనన్నారు.