బీహార్: ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బీహార్ లోని బెలాగంజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో తాను వ్యూహకర్తగా వ్యవహరించిన రాజకీయ పార్టీల నుంచి ప్రతీ ఎన్నికకు రూ.100 కోట్లకు పైగా ఫీజు వసూలు చేసినట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. తన ప్రచారాలకు ఎలా నిధులు సమకూర్చుకుంటారో ప్రజలు తనను తరచుగా అడుగుతారని ఆయన తెలిపారు.వివిధ రాష్ట్రాల్లోని పది ప్రభుత్వాలు తన వ్యూహాలతో నడుస్తున్నాయని పీకే గుర్తుచేశారు.
తన ప్రచారానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని కొందరు అడుగుతున్నారని, తాను అంత బలహీనంగా లేనని, తాను ఓ ఎన్నికల్లో సలహా ఇస్తే 100 కోట్లకు పైగా వస్తాయని పీకే వెల్లడించారు. బీహార్‌లో త్వరలో జరిగే నాలుగు ఉప ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ తరఫున ఆయన అభ్యర్ధుల్ని నిలబెట్టారు. నవంబర్ 13న ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న ప్రకటిస్తారు. ఈ నాలుగు స్థానాల్లో బెలగంజ్, ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్, తరారీ ఉన్నాయి. వీటిలో ప్రశాంత్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
కాగా, గతంలో ఏపీ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తర్వాత ఆ పని వదిలేసి బీహార్ లో జన్ సురాజ్ ఉద్యమం ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చి రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చినందుకు వారి నుంచి ఎంత తీసుకునే వారో వెల్లడించారు.