న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి తరువాత గాలినాణ్యత మరింత పడిపోయింది. పొగమేఘాలు ఆకాశాన్ని కప్పేసి, ప్రజలు విషపూరిత గాలిని పీలుస్తున్నారు. దీపావళికి బాణసంచా కాల్చవద్దని అనేక సూచనలు చేసినప్పటికీ, పండుగ సందర్భంగా భారీగా బాణసంచా కాల్చడంతో కాలుష్యం మరింత ఎక్కువయ్యింది. ప్రస్తుతం ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ వంటి పరిస్థితిని తలపిస్తోంది. ఉదయం 5.30 గంటలకు అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 700కి పైగా నమోదైంది. కొంత ప్రాంతంలో పొగమంచుతో కలసి కాలుష్యం ఉండటంతో రోడ్లను స్పష్టంగా చూడడం కూడా కష్టంగా మారింది.
ఆనంద్ విహార్ – 714, సిరిఫోర్ట్ – 480, గురుగ్రామ్ – 185, డిఫెన్స్ కాలనీ – 631, నోయిడా – 332, షహదర – 183, నజాఫ్ ఘర్ – 282, పట్పర్గంజ్ – 513 పాయింట్లకు గాలినాణ్యత పడిపోయింది. దీపావళికి ముందు 400 పైగా ఉన్న ఏక్యూఐ ఇప్పుడు 700 దాటడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్టల కాల్చడం, వాహనాల నుంచి వస్తున్న పొగ, మరియు దీపావళి క్రాకర్లు కలసి ఢిల్లీని ప్రమాదకర స్థితిలోకి నెట్టేశాయి. 2016 నుండి దీపావళి తరువాత ఢిల్లీలో గాలినాణ్యత ఇలాగే కొనసాగుతోంది: 2016లో 431, 2017లో 319, 2018లో 281, 2019లో 337, 2020లో 414, 2021లో 382, 2022లో 312 పాయింట్లు నమోదయ్యాయి.