న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా (59) గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో కొంతకాలం బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ.. తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
జితేంద్ర సింగ్ చిన్న సోదరుడు అయిన దేవేంద్ర, ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో నగ్రోటా నియోజకవర్గంలో విజయం సాధించారు. జమ్మూ ప్రాంతంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి జోగిందర్ సింగ్‌ను 30,472 ఓట్ల తేడాతో ఓడించి గెలుపొందారు. 2014 ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి ఎన్సీ అభ్యర్థిగా గెలిచారు. డోగ్రా సమాజానికి చెందిన ఆయన బలమైన నేతగా ప్రసిద్ధి చెందారు.
కాగా, ఎమ్మెల్యే దేవేందర్ రాణా మరణం గురించి తెలిసిన వెంటనే అనేక రాజకీయ నాయకులు జమ్మూ గాంధీనగర్ ప్రాంతంలో ఆయన ఇంటికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా కూడా ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఢిల్లీ నుంచి నాగరోటకు బయలుదేరారని సమాచారం. ప్రస్తుతం దేవేందర్ సింగ్ రాణా ఇంటి వద్ద చాలా మంది నాయకులు సంతాపం తెలిపేందుకు చేరుతున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆయన మృతి గురించి తెలిసి తీవ్రంగా దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ‘దేవేందర్ సింగ్ రాణా ఆకస్మిక మరణం నాకు బాధ కలిగించింది. ఆయన ఒక దేశభక్తుడు, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పని చేసిన నాయకుడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి’ అని గవర్నర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఎమ్మెల్యే దేవేందర్ రాణా మరణంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఉపముఖ్యమంత్రి సురిందర్ కుమార్ చౌదరి, కాంగ్రెస్ ఎమ్మెల్యే గులామ్ అహ్మద్ మీర్, పిడిపి అధినాయకురాలు మెహ్‌బూబా ముఫ్తీ కూడా సంతాపం తెలిపారు.