పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్ లాగా వాడుకున్నారని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామానాయుడు సున్నితమైన కానీ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. మంత్రి నిమ్మల వ్యాఖ్యానంలో, జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలవరం ఎత్తుపై జగన్ వ్యాఖ్యలు అబద్ధాలేనని, తాము ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లకు పెంచి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.
పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు పూర్తి అవ్వడంలో 15 నెలలు జాప్యం ఏర్పడిందని, దీనివల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం తన కుటుంబ ప్రయోజనాల కోసం జలవనరులపై తప్పుడు నిర్ణయాలు తీసుకుందని, తన అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని నిమ్మల విమర్శించారు. జగన్ ఇప్పటికైనా అబద్ధాల ప్రచారం మానుకోవాలని, తన కుటుంబ విభేదాలపై దృష్టి పెట్టాలని నిమ్మల రామానాయుడు సూచించారు.