దీపావళి (Diwali) రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం (Temple) ఒకటి ఉందని మీకు తెలుసా..? అంతే కాదు ఆ ఆలయ తలుపులు ఏడాదికోసారి దీపావళికి.. ముందు మాత్రమే తెరుస్తారు. ఆలయం తెరిచి పది లేదా పన్నెండు రోజులు అయ్యాక.. గర్భగుడిలో పూలూ, నేతితో పెట్టిన దీపం, నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత తలుపులు మూస్తారు. మళ్లీ ఏడాది తర్వాత తలుపులు తెరిచేనాటికి కూడా.. ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుంది..ఏంటి నమ్మడం లేదా..? ఇది నిజమండి.
ఈ ఆలయం ఎక్కడ ఉందనే కదా..కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఈ ఆలయం ఉంది. హసనాంబా ఆలయం (Hasanamba Temple) గా పిలువబడే ఈ ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవి (Durga Devi Hasanamba Devi) గా పూజలు అందుకుంటుంది. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు.
ఈ ఆలయ (Hasanamba Temple Story) వెనుక కథ..
అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకోసం తపస్సు చేస్తున్న క్రమంలో.. బ్రహ్మ ప్రత్యక్షమవ్వడంతో తనకు మరణం లేకుండా ఉండేలా వరం ఇవ్వాలని కోరుకుంటాడు. ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడం మొదలుపెడతాడు. ఇది తెలిసిన శివుడు యోగీశ్వరి అనే శక్తిని సృష్టిస్తాడు. అ శక్తి బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే సప్తమాత్రికలతో కలిసి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ తరువాత సప్తమాత్రికలు కాశీ వెళ్లే ప్రయత్నంలో ఈ హసన్‌కి చేరుకుంటారు. ఈ ప్రాంతం నచ్చడంతో మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి ఈ ఆలయం ఉన్న ప్రాంతంలోని ఓ కొండలో మమేకం అయితే మరో ముగ్గురు దేవతలు దేవగిరి హోండ అనే ప్రాంతంలో ఉండిపోతారు. బ్రాహ్మి మాత్రం కెంచెమ్మన హాస్కోట్ పొలిమేరల్లో ఉందని అంటారు. అలా అప్పటినుంచీ ఈ ఆలయంలో అమ్మవారు మూడు రాళ్ల రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తోందట.
అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండటం వల్లే ఆమెను హసనాంబాదేవిగా పిలుస్తారట. అయితే… అమ్మ ఇక్కడ వెలసిన కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించి తనని ఏడాదికోసారి కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పడంతో అప్పటినుంచీ అదే ఓ ఆచారంలా వస్తోందని ఆలయ నిర్వాహకులు చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథా ప్రాచుర్యంలో ఉంది. ఓ అమ్మవారి భక్తురాలిని ఆమె అత్త చిత్రహింసలు పెట్టేదట. అలా ఓ రోజు ఆ కోడలు గుడికి వచ్చినప్పుడూ అలాగే బాధపెట్టడంతో అమ్మకు కోపంవచ్చి ఆ అత్తను రాయిలా మార్చేసిందనీ ఇప్పటికీ ఆ రాయి ఆలయంలోనే ఉందనీ అంటారు. ఏడాదికోసారి మిల్లీమీటరు చొప్పున జరిగే అమ్మ ఆ రాయిని చేరుకున్నప్పుడు కలియుగం అంతమవుతుందనేది స్థానికుల నమ్మకం. అదేవిధంగా మరోసారి నలుగురు దొంగలు ఈ ఆలయంలోని అమ్మవారి నగలు దొంగిలించేందుకు వచ్చి రాళ్లుగా మారిపోయారట. ఈ రాళ్లను కూడా స్థానికంగా ఉండే కల్లప్ప గుడిలో చూడొచ్చని అని అంటారు.
కర్ణాటకలోని హాసన్ జిల్లాలో బెంగుళూరు నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని హాసనాంబ దేవాలయం అంటారు. ఈ ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. పూర్వం దీనిని సిహమసన్‌పురి అని పిలిచేవారు. దీపావళి సందర్భంగా ఈ ఆలయాన్ని సందర్శించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. దీపావళి సందర్భంగా 7 రోజులు మాత్రమే ఈ ఆలయ తలుపులు తెరుస్తారని చెబుతారు. ఆలయ తలుపులు తెరిచినప్పుడు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని జగదంబను దర్శించి ఆశీస్సులు పొందుతారు. ఈ దేవాలయం తలుపులు మూసిన రోజున ఆలయ గర్భగుడిలో స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగిస్తారు. అలాగే ఆలయ గర్భగుడిని పూలతో అలంకరించి బియ్యంతో చేసిన వంటలను ప్రసాదంగా సమర్పిస్తారు. ఏడాది తర్వాత మళ్లీ దీపావళి రోజున గుడి తలుపులు తెరిస్తే దీపాలు వెలుగుతూనే ఉంటాయని, పువ్వులు కూడా వాడిపోవని స్థానికులు చెబుతున్నారు.