హైడ్రా (హైదరాబాదు ఇన్విరాన్‌మెంట్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ రెగ్యులేటరీ అథారిటీ) చెరువుల్లో ఆక్రమణలను తొలగించి, వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో, ఔటరరింగురోడ్ దగ్గర ఉన్న నానక్‌రామ్‌గూడ చౌరస్తాలోని తౌటోని కుంటను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం సందర్శించారు.
తౌటోని కుంట పునరుద్ధరణకు అవసరమైన చర్యలపై రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిపాలన ప్రాంతాల నుంచి కుంటకు నీరు చేరే మార్గాలను కూడా పరిశీలించారు.
మౌలాన ఆజాద్ నేషనల్ ఉర్డు యూనివర్సిటీ ఖాళీ స్థలంలో వర్షపు నీరు నిలవడం వల్ల అక్కడి అపార్టుమెంట్ల సెల్లార్‌లలో నీరు చేరే సమస్య ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను నివారించేందుకు యూనివర్సిటీ ఖాళీ స్థలంలో వరద నీరు తౌటోని కుంటకు చేరేలా చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తద్వారా తౌటోని కుంట నిండితే ఆ నీరు నేరుగా భగీరధమ్మ చెరువుకు చేరేలా కాలువ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో, నివాసాల మధ్య ఉన్న చెరువుల పునరుద్ధరణపై హైడ్రా దృష్టి సారించగా, ముందుగా వాటి ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించేందుకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.