ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు విరాళాలపై ఆదాయ పన్ను మినహాయింపును కల్పిస్తూ కొత్త ఛారిటబుల్ ట్రస్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద విరాళాలు సేకరించేందుకు, ఈ ట్రస్టు ప్రారంభానికి కేంద్ర ఆదాయపన్ను, కార్పొరేట్ వ్యవహారాల శాఖల నుంచి అనుమతులు లభించాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 204 క్యాంటీన్లలో అన్న క్యాంటీన్ సేవలు అందుబాటులో ఉండగా, రోజుకు సుమారు 1.50 లక్షల మందికి భోజనం ఇస్తున్నారు. తక్కువ ధరలో మూడు పూటల భోజనం అందించేందుకు ప్రభుత్వం సబ్సిడీ కింద రోజుకు కోటి రూపాయలు ఖర్చు చేస్తోంది.
విరాళాల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా సిద్ధం చేశారు. దాతలు దానం చేసిన మొత్తం ఆధారంగా, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల కోసం ప్రత్యేక విరాళాలు సేకరించనున్నారు. ఉదాహరణకు, రూ.26.25 లక్షలు విరాళం ఇస్తే ఒక రోజు మొత్తం ఆహారం వారి పేరుతో అందించబడుతుంది. ఇక విరాళాలపై ఆన్‌లైన్ రసీదులు అందుబాటులో ఉంటాయి, వీటి ద్వారా ఆదాయపన్ను మినహాయింపును పొందొచ్చు.