అమరావతి: తెలంగాణ నుండి రిలీవ్ అయిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యలు అప్పగించింది. ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ వైస్ చైర్ పర్సన్ మరియు ఎండీగా ఆమ్రపాలిని నియమించడం జరిగింది. అదనంగా ఏపీ పర్యాటక సంస్థ సీఈవోగా కూడా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులను ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ జారీ చేశారు.
కాగా, ఇటీవలే తెలంగాణ నుండి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఏపీకి చేరిన సంగతి తెలిసిందే. ఆమ్రపాలితో పాటు వాకాటి కరుణ మరియు వాణీ ప్రసాద్ కూడా ఈ రాష్ట్రానికి వచ్చారు. వారిని కూడా తాజాగా పోస్టింగ్ లు ఇచ్చారు. వాకాటి కరుణను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ గా నియమించారు. ఆమెకు నేషనల్ హెల్త్ మిషనర్ డైరెక్టర్ గా కూడా అదనపు బాధ్యతలు కేటాయించబడ్డాయి. వాణీ ప్రసాద్ ను కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. వీరితోపాటు ప్రస్తుతం పురావస్తు శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న జి. వాణీ మోహన్‌ను సాధారణ పరిపాలన శాఖలో సర్వీస్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.