ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల కేసులు పెరుగుతున్నాయి. విమానాలు, పలు ప్రముఖ ప్రదేశాలు, హోటళ్లకు తరచుగా బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వస్తుండడం ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలోని పలు హోటళ్లకు, ప్రసిద్ధి చెందిన వరదరాజస్వామి ఆలయానికి మూడు రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం అందరినీ కలవరపెట్టింది.
ఇవాళ రెండు హోటళ్లు, ఒక ఆలయానికి ఈమెయిల్ ద్వారా వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో హోటళ్ల యాజమాన్యాలు, ఆలయ అధికారులు వెంటనే పోలీసులను సంప్రదించారు. ఆ వెంటనే స్పందించిన పోలీసులు స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లను రంగంలోకి దింపి, తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ, ఈ బెదిరింపులు ఉత్తుత్తి అని తేలడం ప్రజల్లో ఊరటను కలిగించింది.