సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం ‘కంగువ’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ ఈ సినిమాను ‘బాహుబలి’ లేదా ‘RRR’ తరహాలో విజయం సాధిస్తుందని ఆశిస్తోంది. సినిమా విడుదలకు ముందు, ప్రమోషన్స్ కోసం సూర్య సహా మూవీ టీం విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవలే సూర్య, బిగ్ బాస్ ఎపిసోడ్‌లో పాల్గొని సినిమాకు మరింత ప్రచారం కల్పించాడు ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ‘కంగువ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గోపీచంద్‌తో ‘శౌర్యం’ ‘శంఖం’ వంటి సూపర్‌హిట్ చిత్రాలు తీసిన శివ, ఈ సినిమాకు దర్శకుడు. కథనంగా చూస్తే ఇది పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినూత్న కథా చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
కంగువ చిత్రం ఏకంగా 2000 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉంది, ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో కొన్ని చిత్రాలు వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతున్నాయి. కంగువ మాత్రం ఈ స్థాయిని మించిపోతుందనే అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ, ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి ఇప్పుడున్న ఆసక్తికర అంశం ఏమిటంటే, ఈ కథను సూర్యకు ముందు అల్లు అర్జున్‌కు వినిపించారట. స్టూడియో గ్రీన్ సంస్థ, అల్లు అర్జున్‌తో కలిసి ఈ కథను తెరకెక్కించాలని మొదట్లో అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ అప్పటికే మూడు ప్రాజెక్టులకు కమిట్ అవడంతో, ఈ కథను వెంటనే చేయలేకపోయారు. అల్లు అర్జున్ తరువాత సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమా చేయాలని భావించినా, అప్పటికి కథ చాలా ఆలస్యం అయ్యింది. ఆ సమయానికే దర్శకుడు శివ ఈ కథను సూర్యకు వినిపించగా, ఆయన వెంటనే ఒప్పుకుని షూటింగ్ ప్రారంభించారు ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో వచ్చిన టాక్ ప్రకారం, ‘కంగువ’ ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఈ కథను ముందు అల్లు అర్జున్ చేయాల్సి ఉండి, చివరకు సూర్య చేతిలోకి వెళ్ళడం, అందరూ భావించినంత ఘన విజయాన్ని సాధిస్తే, ఇది అల్లు అర్జున్ చేయాల్సిన మంచి సినిమా చేజారిపోయిందని చెప్పుకోవచ్చు.