పచ్చి బటానీ (గ్రీన్ పీస్) తో తయారైన కర్రీ ఉత్తర భారతదేశంలోని రుచికరమైన వంటకాలలో ఒకటి. ఈ వంటకం మీ భోజనంలో చపాతీలు, పరాటాలు లేదా పూరీలతో రుచిని పెంచుతుంది. ఇక్కడ ఈ కర్రీని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- పచ్చి బటానీ: 1.5 కప్పులు,పెద్ద ఉల్లిపాయ: 1,జీడిపప్పులు: 10,పచ్చిమిరపకాయలు: 2-3,అల్లం వెల్లుల్లిపేస్ట్: 1 స్పూన్, ఎండు కారం: 1 స్పూన్,పసుపు: ½ స్పూన్,ఇంగువ: ¼ స్పూన్,ఉప్పు: తగినంత,నూనె: 2 స్పూన్స్
తయారీ విధానం:
ముందుగా పచ్చి బటానీలను కడిగి, కొద్ది సమయం నీటిలో నాననివ్వాలి. తరువాత ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు మరియు రెండు స్పూన్ల నీరు పోసి మెత్తగా పేస్ట్ చేయాలి.
ఇప్పుడు ఓ కడాయిలో నూనె వేసి, జీలకర్ర వేయించి చిటపట అనేవరకు వేగించాలి. ఉల్లిపాయల పేస్ట్ వేసి, 2-3 నిమిషాలు ఉడికించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఎండు కారం, పసుపు, ఇంగువ వేసి బాగా కలిపి, నీళ్లలో నానబెట్టిన గ్రీన్ పీస్‌ను కలిపి కొంచెం ఉడకనివ్వాలి. దీనిని తక్కువ మంటపై కొన్ని నిమిషాలు ఉంచాలి. చివరగా కొత్తిమీర కట్ చేసి కొంత నిమ్మరసం చల్లించి, స్టవ్ కట్టాలి. ఇక, మీ గ్రీన్ పీస్ కర్రీ రెడీ! ఈ కర్రీను మీ ఇష్టమైన చపాతీ, పూరీ లేదా పరాటాతో పాటు తీసుకోండి.