హైదరాబాద్: కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ కనకరాజు, అనారోగ్యంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఆయన అంత్యక్రియలు ఆదివాసీల సంప్రదాయ ప్రకారం జరగనున్నాయి.
కనకరాజు మరణంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ కళలకు తీరని లోటు అని పేర్కొన్నాడు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం, తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడడం వంటి గొప్ప కృషిని కనకరాజు అందించాడు అని కొనియాడారు.
ఆదివాసీ కళకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజు మరణం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కనకరాజు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
కాగా, ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యం అందరినీ అలరిస్తూ వచ్చిన కనకరాజు ఈసారి పండుగకు కొన్ని రోజుల ముందు మరణించడంతో ఆదివాసీలు తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రోత్సహించేందుకు చేసిన కృషికి 2021లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించిన విషయం తెలిసిందే.