కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కలిసి ఆయన అనుచరుడు గంగారెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సమావేశం తర్వాత మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభివృద్ధికి చేసిన కృషి విలువైనదని, ఆయన సేవలు పార్టీకి ఎప్పటికీ అవసరమని ప్రశంసించారు. ప్రభుత్వం పాలనపై ఉన్న అభ్యంతరాలను కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమీక్షించాలని జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు.
తాజాగా జరిగిన గంగారెడ్డి హత్య నేపథ్యంలో జీవన్ రెడ్డి సైతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గంగారెడ్డి హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మధుయాష్కీ, జీవన్ రెడ్డిల భేటీతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించడంతో, ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చూస్తున్నారు.