బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర తుఫానుగా బలపడొచ్చని పేర్కొంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటొచ్చని భావిస్తోంది. దీని ప్రభావంతో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం(D)ల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది.
ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 4 రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లో.. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒడిశాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ దానా తుఫాన్ ఈనెల 24వ తేదీన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ దానా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే సమయంలో మరింత భీకరమైన గాలులు, వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఈ దానా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధం అయ్యాయి.