హైదరాబాద్: ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు సోమవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద బాంబ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలలకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ రావడంతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు.
పాఠశాలకు చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పాఠశాలలోని పిల్లలను క్షేమంగా వారి వారి ఇళ్లకు స్కూల్ యాజమాన్యం పంపించింది. ఘటనా స్థలికి రాచకొండ సీపీ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీబీ మహేశ్ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
కాగా, ఆదివారం దేశరాజధానిలోని రోహిణిలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మరుసటిరోజే దేశవ్యాప్తంగా అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు, యాజమాన్యం అప్రమత్తమైంది.