న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ప్రయాణికులను హెచ్చరించాడు. గతేడాది కూడా అతడు ఇలాంటి హెచ్చరికనే జారీచేశాడు.
సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు అయిన పన్నున్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉంది. సిక్కుల ఊచకోత జరిగి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనీ హెచ్చరికలు జారీచేశాడు. ఆ విమానాల్లో ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించాడు. ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరగొచ్చని పేర్కొన్నాడు.
కాగా, గత కొన్ని రోజులుగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. నిన్న కూడా 25 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఇందులో ఉన్నాయి. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో విమనాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.