న్యూఢిల్లీ: దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని పొగ, కాలుష్యం కమ్మేస్తోంది. దీపావళికి ముందే ఢిల్లీ ఎన్సీఆర్ లో గాలి నాణ్యత క్షీణించింది. దీంతో కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 293 పాయింట్లుగా గాలి నాణ్యత ఉంది. గత మూడు రోజుల నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ లో కాలుష్య నివారణకు మొదటి దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) అమలవుతోంది. ఢిల్లీ – ఎన్‌సిఆర్ లో కాలుష్య నియంత్రణకోసం శీతాకాల – నిర్దిష్ట వాయు కాలుష్య చర్యలను అమలు చేయాలని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్రం వాయు కాలుష్య నియంత్రణ ప్యానెల్ ఆదేశాలు జారీ చేసింది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-50 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుందని పరిగణిస్తారు. AQI 51-100 మధ్యలో ఉంటే సంతృప్తికరమైన గాలి నాణ్యతగా పరిగణిస్తారు. AQI 101-200 మధ్య ఉంటే మధ్యస్థంగా గాలి నాణ్యత ఉందని అర్ధం. అదేవిధంగా AQI 201- 300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 301-400 మధ్య ఉంటే మరింత అధ్వాన్నంగా గాలి నాణ్యత ఉందని అర్ధం. AQI 401-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్ధం చేసుకోవచ్చు. గాలి నాణ్యత 447కు పడిపోవటం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. అయితే, ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 293 పాయింట్లుగా గాలి నాణ్యత ఉంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పరిశీలిస్తే.. ఆనంద్ విహార్ లో 339 పాయింట్లు, అలీపూర్ 304 పాయింట్లు, బవానా 329 పాయింట్లు, బురారీ 339 పాయింట్లు, ద్వారకా సెక్టార్ 324 పాయింట్లు, జహంగీర్‌పురి 354 పాయింట్లు, ముండ్కా 375 పాయింట్లు, నరేలా 312 పాయింట్లు, పంజాబీ బాగ్ 312 పాయింట్లు, రోహిణి 362 పాయింట్లు, షాదీపూర్ 337 పాయింట్లు, వివేక్ విహార్ 327 పాయింట్లు గాలి నాణ్యత ఉంది. గత మూడు రోజుల నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ లో కాలుష్య నివారణకు మొదటి దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) అమలవుతోంది.