హైదరాబాద్ : ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరో సారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలే లక్ష్యంగా మరో సారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఏకకాలంలో 30 ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. గురువారం వేకువజాము నుంచి ఈ ఐటీ సోదాలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్ పేట, కొల్లూరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ తనిఖీలు కొనసాగిస్తున్నారు. అన్విత బిల్డర్స్, ప్రాపర్టీస్ కార్యాలయాలు, యాజమాన్యాల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి.
చైతన్యపురిలోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలోనూ సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాస అచ్యుతరావు నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. మలక్పేట నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ నివాసంలో, ఆయనకు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు 40 బృందాలుగా రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించి పలు దస్త్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో గత నెల 23వ తేదీన విస్తృతంగా ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.