వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు అందించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు. ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.
ఈ నోటీసుల పై సజ్జల స్పందించారు. తానేమీ దేశం వదిలి పారిపోలేదని, ఎందుకు నోటీసుల పేరుతో హడావుడి చేస్తున్నారని అసహనం ప్రదర్శించారు. విదేశాల్లో వారం రోజుల పర్యటన అనంతరం తిరిగొచ్చానని, కానీ నోరుందని అడ్డగాడిదల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
“పారిపోనివ్వం అంటున్నారు… ఇక్కడ ఎవరు పారిపోతున్నారు? ఎందుకు పారిపోతారు? గతంలో చంద్రబాబు వ్యవహారంలో నోటీసులు ఇవ్వగానే పెండ్యాల శ్రీనివాస్ పరారైనట్టు అందరూ పరారవుతారా? తప్పులు చేసిన వాళ్లు కదా పారిపోయేది? మీరు పెట్టింది తప్పుడు కేసు… ఆ విషయం ఎలాగూ న్యాయస్థానంలో నిరూపితమవుతుంది. బలవంతం చేసి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించినా, చివరికి న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన పనిలేదు. న్యాయస్థానంలోనే తేల్చుకుంటాం’ అన్నారు.