అక్రమ నిర్మాణాల ఫై ఉక్కుపాదం మోపేలా రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ కు అనేక ఆదేశాలు ఇవ్వగా..తాజాగా మరో అధికారం లభించింది.ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు జీహెచ్ఎంసీ చట్టంలోని అధికారాలను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ మాట్లాడుతూ… నగర పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలకు సంబంధించి ఇకపై హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందన్నారు.
జీహెచ్ఎంసీ చట్టసవరణతో హైడ్రాకు పూర్తిస్థాయి అధికారాలు వచ్చాయన్నారు. ఇకపై ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రానే నోటీసులు ఇస్తుందని వెల్లడించారు. కూల్చివేతలు, స్వాధీనం సహా తదితర అధికారాలన్నీ హైడ్రాకు లభించాయని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల హైడ్రా మరింత బలపడిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీల్లో పురపాలక చట్టం ప్రకారం హైడ్రా నడుచుకుంటుందన్నారు.