తెలంగాణ నుంచి రిలీవ్ అయిన పలువురు IAS అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంఛార్జులను నియమించింది. ఇటీవల డీవోపీటీ తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్న ఐఏఎస్‌లను ఏపీకి, ఏపీలో కొనసాగుతున్న అధికారులను తెలంగాణకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేయడం తో తెలంగాణ నుంచి వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి రిలీవ్ అయ్యారు. వారి స్థానంలో ఇంఛార్జులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, మహిళా సంక్షేమశాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా ఆర్వీ కర్ణన్, ఆయుష్ డైరెక్టర్‌గా క్రిస్ట్రినాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
అంతకు ముందు..ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్‌ను ఈనెల 16వ తేదీలోపు ఏపీకి తిరిగి వెళ్లాలని డీఓపీటీ ఆదేశించగా.. దానిపై ఆ అధికారులు క్యాట్‌లో పిటిషన్ వేశారు. క్యాట్‌లో వారికి ఎదురుదెబ్బ తగలిన విషయం తెలిసిందే. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని కాట ఆమ్రపాలితో సహా ఐఏఎస్ అధికారులను ఆదేశించింది. అయితే క్యాట్ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానికి న్యాయస్థానం అంగీకరించలేదు. కొంత మందలిస్తూనే వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.ఎక్కడికి వెళ్లినా కూడా ఎదురుదెబ్బలు తగులుతుండడంతో ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు గందరగోళంలో పడ్డారు.